Medico Priyaka: మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక..!
రాజమండ్రిలో ఈనెల 3న ఆదిత్య మాల్ లో తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లి వస్తూ ఇద్దరు తాగుబోతులతో వాగ్వాదం నేపథ్యంలో కారు గుద్దేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్ధిని ప్రియాంక (Medico Priyanka) ఇవాళ చనిపోయింది.ఈ మేరకు ఇవాళ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రియాంకను బతికించేందుకు రెండు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. బ్రెయిన్ డెడ్ అయిన ఆమె.. ఇవాళ మధ్యాహ్నం 3.25కు కన్ను మూసినట్లు ప్రకటించారు.
తెలంగాణలోని గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెకూ, మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆంఢ్రూ విలియం అనే ఇద్దరితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె స్నేహితుడు నడుపుతున్న బైక్ వెనుక కూర్చొన్న ప్రియాంకను.. వారు కారుతో గుద్దేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతరం మాల్ బయటకు వెళ్లగానే ఆమె బైక్ ను వారు గుద్దేయడమే కాకుండా ఆమె తలపై నుంచి కారు పోనిచ్చారు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.

ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే తొలుత ఈ కేసును నామమాత్రపు సెక్షన్లలో నమోదు చేసిన పోలీసులు..ఆ తర్వాత విమర్శలు రావడంతో సెక్షన్లు మార్చారు. తాజాగా ఆమె తండ్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర సెక్షన్లతో కేసు పెట్టారంటూ మరో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై స్పందించడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితమే బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంకను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె శరీరం స్పందించకపోవడంతో ఇవాళ చనిపోయినట్లు ప్రకటించారు.




Click it and Unblock the Notifications