విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు అసెంబ్లీలో ప్రతిపక్షాల డిమాండ్

విద్యార్థులపై కేసులన్నీ ఎత్తేయాలని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు చిరంజీవి కోరారు. ఇలాంటి చర్యలకు తిరిగి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ కేసులన్నింటినీ ప్రస్తుతానికి ఎత్తేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని ప్రతిపక్షాల సభ్యులు మాత్రమే కాకుండా కాంగ్రెసు సభ్యులు కూడా ఏకగ్రీవంగా కోరుతున్నప్పుడు ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లడం సరి కాదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. రైతు సమస్యలపై చర్చ జరగాలని బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి, సిపిఎం సభ్యుడు జూలకంటి రంగా రెడ్డి సూచించారు.
విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని చెప్పిందని, ఇప్పటికే కొన్ని కేసులు ఎత్తేశామని, మిగతా కేసులను దశవారీగా ఎత్తేస్తామని మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి చెప్పారు. ప్రభుత్వ తీరు నచ్చకపోతే నిరసన తెలిపేందుకు తెరాస సభ్యులకు అవకాశం ఉందని, సభను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. రైతు సమస్యలపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత కూడా సభ సద్దుమణగలేదు.












Click it and Unblock the Notifications