వైయస్ జగన్ కు కిరణ్ కుమార్ చెక్: ఎమ్మెల్యేలకు భరోసా

ముఖ్యమంత్రి గత రెండు రోజులుగా వైయస్ జగన్ వ్యవహారంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రికి, శాసనసభ్యులకు మధ్య సంబంధాలు మరింత మెరుగుపడితే బాగుంటుందనే భావన నేతల్లో వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం సోమవారం రాత్రి జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలన్నీ ఓపిగ్గా విన్నారు. వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై శ్రద్ధచూపుతానని చెప్పారు. అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుందని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందని వారికి చెప్పారు. ప్రస్తుతం జగన్ ప్రధానంగా కోస్తా ప్రాంతంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఆ జిల్లాల మంత్రులతో మంతనాలు సాగిస్తున్నారు. ఆయా జిల్లాల్లో జగన్ వెంట ఎమ్మెల్యేలెవరూ వెళ్ళకుండా కట్టడి చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించాలని ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణలు సోమవారం రాత్రి జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు ఎమ్మెల్యేలందరినీ ఒక హోటల్‌కు విందుకు తీసుకెళ్ళి మంతనాలు సాగించారు. అంతా కలసికట్టుగా కాంగ్రెస్ కోసం పనిచేయాలని వారికి ఉద్భోదించారు. మరోవైపు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహం, పంట నష్టపరిహారం వంటి విషయాలకు సంబంధించి వారితో చర్చించారు. ఆ సందర్భంగా పార్టీ వ్యవహారాలపైనా చర్చ సాగింది. జగన్ కార్యకలాపాల నేపథ్యంలో చురుగ్గా వ్యవహరించాలని, కలసికట్టుగా సాగుదామని ముఖ్యమంత్రి వారికి సూచించారు.












Click it and Unblock the Notifications