వైయస్ జగన్ తో బెడిసికొట్టిన వైయస్ వివేకానంద రెడ్డి చర్చలు

దీన్నిబట్టి జగన్ తో వైయస్ వివేకానంద రెడ్డి చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి పులివెందుల సభలో ప్రజా రక్షణ సమితి పేర కరపత్రం విడుదలపై జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి బయటకు వచ్చిన వెంటనే ఆయన కూతురు, అల్లుడు కూడా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వైయస్ జగన్ వెళ్లిపోయారు. మంత్రి పదవి తాను అడిగి తీసుకున్నానని, తనను ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇవ్వలేదని వివేకానంద రెడ్డి చెప్పిన విషయంపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రాజకీయంగా భిన్న మార్గాలు పట్టిన బాబాయ్, అబ్బాయ్ మరోసారి కలుసుకున్నారు. కాంగ్రెసులోనే ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చెపట్టిన వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం వైయస్సార్ కుటుంబానికి సన్నిహిత బంధువు అయిన సివి సుబ్బారెడ్డి నివాసంలో జరిగింది. సుబ్బారెడ్డి నివాసంలో క్రిస్మస్ వేడుకలకు మాత్రమే వీరు హాజరయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలను సాకుగా తీసుకుని వైయస్ వివేకానంద రెడ్డికి, వైయస్ జగన్ కు మధ్య వైయస్సార్ కుటుంబ సభ్యులు సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు సాగించారు. కుటుంబపరంగానే కాకుండా రాజకీయంగా కూడా వీరిరువురి మధ్య సయోధ్య ఉండాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జీవించి ఉన్న కాలంలో పులివెందులలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకునేవారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు తనకు బాధ్యతలు అప్పగించారని, వాటిని నిర్వహించడమే తన కర్తవ్యమని వైయస్ వివేకానంద రెడ్డి గురువారం స్పష్టం చేశారు. రాజకీయంగా వైయస్ జగన్ తో కలిసేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ పై పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి రాజకీయంగా జగన్ తో కలిసి పని చేయడానికి ముందుకు రావడానికి ఇష్టపడలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications