త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్: తమిళనాడులో రాజకీయ దుమారం!
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషా కృష్ణన్‌ను ఉద్దేశించి చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బహిరంగ వేదికలపై మహిళల పట్ల ఇలాంటి అశ్లీల, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు గట్టిగా మందలించారు.
ఈ వివాదం ఆగస్టు 3న తంజావూరులో జరిగిన ఓ బహిరంగ ర్యాలీలో మొదలైంది. కావేరీ జల వివాదంపై మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ సమయంలో సభలోని జనాలు హఠాత్తుగా 'త్రిష, త్రిష' అని నినాదాలు చేయగా.. ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. " ఆ నీరు వేరే చోటికి చేరినా చేరకపోయినా అక్కడికి మాత్రం తప్పక చేరుతుంది" అని డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్ చేశారు. అయితే ఈ వివాదం ముదిరిపోవడంతో తాను కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడానని ఆయన తర్వాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరిక సమాజంలో అశ్లీల లేదా నీచమైన జోకులు వేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని ఓ మంచి పరిణామంగా అభివర్ణించిన కంగనా రనౌత్.. ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నప్పటికీ.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడే నాయకులకు ఇది ఓ గట్టి హెచ్చరికలా నిలుస్తుందని కామెంట్ చేశారు.
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై స్పందించారు. పురుష నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను లాగడం మానుకోవాలని హితవు పలికారు. డీఎంకేలో శివాజీ కృష్ణమూర్తి వంటి నాయకులు గతంలోనూ ఇలాంటి అసభ్యకర భాషను ఉపయోగించారని.. అలాంటి వైఖరిని ప్రోత్సహించడం వల్లే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయని విమర్శించారు. రాజకీయంలో మహిళల గౌరవాన్ని చులకన చేయడం, ఆపై దానిని సమర్థించుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా ఈ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేధాలు ఏవైనా ఉన్నప్పటికీ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఉదయనిధిపై 6 వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తదనంతర పరిణామాల్లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.














Click it and Unblock the Notifications