TTD కొత్త ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత - ఆ ఒక్కటే తేలాల్సింది..!?
TTD ప్రస్తుత పాలక వర్గం గడువు నేటితో ముగుస్తోంది. కొత్త పాలక వర్గం పైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్ల కాల పరిమితితో బీఆర్ నాయుడు ఛైర్మన్ గా ప్రస్తుత బోర్డును ఏర్పాటు చేసారు. కాగా.. ఇప్పుడు టీటీడీ కొత్త ఛైర్మన్ గా టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. అయితే.. మారుతున్న సమీకరణాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
టీటీడీ ప్రస్తుత పాలక వర్గం గడువు నేటితో పూర్తి అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్ న బీఆర్ నాయుడు ఛైర్మన్ గా మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తూ 2024 నవంబరు 1న ఉత్తర్వులు ఇచ్చింది. నవంబరు 6న బీఆర్ నాయుడు చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో శనివారం (అక్టోబరు 31)తో ప్రస్తుత బోర్డు కాలపరిమితి పూర్తికానుంది. దీంతో చైర్మన్ ఆఫీస్ కార్యకలాపాలు, చైర్మన్, సభ్యుల సిఫారసు లేఖలపై దర్శన కేటాయింపులు వంటివన్నీ శనివారం నుంచి నిలిచిపోనున్నాయి. అయితే బోర్డు కాలపరిమితి పొడిగింపునకు చట్టంలో ఎలాంటి అవకాశం లేదు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు ప్రస్తుతానికి కుదరదు. ఎన్నికల తర్వాతే నూతన బోర్డు ఏర్పాటు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల తరువాత కొత్త బోర్డు..!
దీంతో, తాత్కాలికంగా అధికారులతో స్పెసిఫైడ్ కమిటీ ప్రభుత్వం నియమించనుంది. కాగా.. పూర్తి స్థాయి ఛైర్మన్.. బోర్డు సభ్యులను డిసెంబర్ లో ప్రకటించనున్నారు. కొత్త ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనతో కళా ఉన్నారని అంటున్నారు. ఆయన వయసు రీత్యా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన లేకపోవడంతో టీటీడీ పదవి ఇచ్చి సంతృప్తి పరచాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. అదే విధంగా జ్యోతుల నెహ్రూ సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన సామాజికవర్గానికి చెందిన ప్రతినిధిగా నెహ్రూకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయం లో తిరిగి బీఆర్ నాయుడుకు మరో అవకాశం పైనా చర్చ సాగుతున్నా.. సాధ్యం కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కొత్త సభ్యులను నియమించనున్నారు. డిసెంబర్ లో జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం తరువాతనే కొత్త కమిటీ నియామకం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో.. కొత్త ఛైర్మన్ గా ఎవరికి అవకాశం తక్కుతుందనే అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
