సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. గరిష్ఠంగా రూ.1.10 లక్షలు జమ!
సింగరేణి కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. సింగరేణి కార్మిక కుటుంబాలలో ఈ దీపావళి మరింత వెలుగులు నింపేలా శుభవార్త చెప్పింది . ఇటీవలే దసరా సందర్భంగా లాభాల వాటా బోనస్ అందుకున్న కార్మికులకు తాజాగా దీపావళి బోనస్ కూడా ప్రకటించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్‌ను నవంబర్ 5వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.ఈసారి దీపావళి బోనస్ కింద మొత్తం రూ.419 కోట్లు చెల్లించనున్నారు. అర్హత కలిగిన ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 అందనుంది.

సుమారు 38 వేల మంది కార్మికులు ఈ ప్రయోజనం పొందనున్నారు. ఇటీవల దసరా సందర్భంగా లాభాల వాటా రూపంలో దాదాపు రూ.600 కోట్లు చెల్లించారు. దీంతో రెండు పండుగల బోనస్‌ల కలయికతో నెల రోజుల వ్యవధిలోనే ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.2.65 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ రెండు బోనస్‌ల కోసం సింగరేణి సంస్థ మొత్తం సుమారు రూ.1,020 కోట్లు ఖర్చు చేస్తోంది.
దీంతో పండుగల సమయంలో కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు లభించనుంది.ఈ బోనస్ నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోని కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో కనీసం 190 పని దినాలు, ఓపెన్‌కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన వారికి పూర్తి బోనస్ అందుతుంది.
తక్కువ రోజులు పనిచేసిన వారికి నిష్పత్తి ప్రకారం లెక్కిస్తారు. అయితే బోనస్ పొందాలంటే కనీసం 30 రోజులు పనిచేసి ఉండాలి.సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత పర్సనల్, ఫైనాన్స్ విభాగాల అధికారులతో మాట్లాడి, నిర్ణీత తేదీన ఖాతాల్లో నగదు జమ కావాలని సూచించారు. ఆయన కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, బోనస్ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవాలని, వీలైనంత మేర పొదుపు చేసుకోవాలని కోరారు.
పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేస్తూ గనుల వారీగా, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అన్నారు.సింగరేణి రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచి, రోజువారీ బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని, బొగ్గు రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని సూచించారు.












Click it and Unblock the Notifications
