రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే నేను కోరుకుంటున్నా: చిరంజీవి

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని శాసనసభలో కోరిన వారిలో మా పార్టీ కూడా ఉందని చిరంజీవి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిపై కేసులు ఎత్తివేయాలన్నారు. విద్యార్థులు కేవలం ఆవేశంలో మాత్రమే చేశారన్నారు. అయితే అసాంఘీక శక్తులపై కేసులను ఎత్తివేయవద్దన్నారు. కేవలం విద్యార్థులపైనే కేసులు ఎత్తివేయాలన్నారు. ప్రతిపక్షాల మాట విని శాసనసభ సమయంలోనే ఎత్తివేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ నాలుగు మార్కులు ఎక్కువ పడేవన్నారు. కానీ ఇంత ఆలస్యంగా వారి పార్టీ వారి ఒత్తిడి మేరకు కేసులు ఎత్తివేయడం వల్ల కిరణ్ కు ఒరిగిందేమీ లేదన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విపక్షాలన్నీ శాసనసభలోనే డిమాండ్ చేసాయని చెప్పారు. రైతుల గురించి పోరాడటంలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇంతకంటే ఎక్కువ సాయం ప్రకటించారని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ ప్రకటించామని ముఖ్యమంత్రి చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. నష్టం గతంలో కంటే చాలా ఎక్కువ జరిగిందన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పార్లమెంటు సభ్యులపై ఉందన్నారు. హెక్టారకు 10వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాము రైతుల తరఫున పోరాటం చేస్తున్నామన్నారు. కోనుగోలు కేంద్రాలు పేరుకే ఉన్నాయన్నారు.
అక్కడ మౌలిక సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం మొక్కుబడిగా పని చేస్తుందన్నారు. రైతులపై వారికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతులకు ఆర్థిక సాయం, మానసిక ధైర్యం గానీ ప్రభుత్వం ఇవ్వలేక పోతుందన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి వారి సమస్యలను తెలుసుకొని సాయాన్ని అందజేయాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కౌలు రైతులే అందరికంటే ఎక్కువ నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోకపోతే చావుల పరంపర కొనసాగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ వ్యవసాయం వ్యర్థమన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మాటలు కడుపులు నింపవని అన్నారు. రైతులను ఆదుకోవడానికి అన్ని నిబంధనలను పక్కన పెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications