కె చంద్రశేఖర రావు బాయ్ కాట్ వ్యూహం ఆంతర్యం ఏమిటి?

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించడం మళ్లీ సమస్యను మొదటికి తేవడానికేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం ఆ అభిప్రాయానికి మరింత బలం చేకూరుస్తోంది. ఏకాభిప్రాయ సాధన కోసం శ్రీకృష్ణ కమిటీ ద్వారా ప్రయత్నాలు చేశామని, ఇంకా చేస్తామని చిదంబరం అఖిల పక్ష సమావేశంలో చెప్పి తప్పించుకునే అవకాశాలున్నాయి. బహుశా, అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణపై పార్టీ విధానాన్ని శ్రీకృష్ణ కమిటీ అడగలేదు, నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమైనా ఆ పని చేయాల్సింది. కానీ, అలా చేయకండా మళ్లీ పాత పద్దతిని కొత్తగా ముందుకు తెస్తోంది. దీన్ని కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మాత్రమే తమ విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ పార్టీల్లో రెండు అభిప్రాయాలున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకులు ఈ రెండు పార్టీలకు కూడా తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. తన పార్టీని రక్షించుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం రెండు వైఖరులను ప్రోత్సహిస్తోంది. అది తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్షగా మారింది. కాంగ్రెసు తన స్పష్టమైన వైఖరి వెల్లడించే వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రెండు కళ్ల సిద్ధాంతంతో హాయిగా కాలం గడపేయవచ్చు. ఈ రెండు పార్టీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టడానికే కెసిఆర్ పార్టీ నుంచి ఒకే ప్రతినిధిని ఆహ్వానించాలని, అప్పుడు తాము సమావేశానికి వస్తామని అంటున్నారు. పైగా, ఓటింగ్ జరపాల్సి వస్తే, తెలంగాణకు మెజారిటీ లభించే అవకాశం ఉంటుంది. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులు ఉంటే, ఓటింగ్ లో తెలంగాణకు వ్యతిరేకంగా మెజారిటీ లభిస్తుంది. సమావేశానికి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడాన్ని కెసిఆర్ వ్యతిరేకించడంలో ఈ అంశం కూడా ఉంది.
పైగా, ఒక పార్టీ నుంచి ఒకే ప్రతినిధి ఉంటే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీలను తెలంగాణ ప్రాంతంలో ఎండగట్టడానికి వీలవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందనే ఆశ సన్నగిల్లిన నేపథ్యంలో ఆ పార్టీలను రెండింటినీ ఎండగట్టడానికి తగిన అవకాశం లభిస్తుందనే కెసిఆర్ ఆలోచన.












Click it and Unblock the Notifications