వికీలీక్స్ గుబులు: స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఇండియన్స్ కుబేరుల చిట్టా?

ఎల్మర్ అందజేసిన జాబితాలో ఆసియా దేశాలు, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియాలతో పాటు పలు దేశాలకు చెందిన వ్యక్తులు, రాజకీయ నేతలు, కార్పొరేట్‌ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, మాఫియా నేతల పేర్లు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ పరిశీలించాక, కొద్ది వారాల్లో వాటిని తమ వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఈ సీడీలను స్వీకరించిన అసాంజ్ తెలిపారు. పన్ను ఎగవేత కోసమే వీరు ఈ బ్యాంకుల్లో సొమ్ము కూడబెట్టారని ఎల్మర్ అన్నారు. డబ్బు దాచుకోవడానికి ఉపయోగించే పద్ధతుల సంక్లిష్టత కారణంగా ఈ పేర్లను బయటపెట్టడం లేదని తెలిపారు."ఈ సమాచారాన్ని కూడా గతంలో మేం అందుకున్న ఇతర సమాచారాల్లానే స్వీకరిస్తున్నాం. వీటిని పూర్తి స్థాయిలో బయటపెడతాం'' అని అసాంజ్ పేర్కొన్నట్లు స్విస్ దిన పత్రిక డీర్ సొన్న్‌టాగ్ తెలిపింది.
స్విట్జర్లాండ్‌లో కఠినంగా అమలయ్యే బ్యాంకింగ్ గోప్యతా చట్టాన్ని ఉల్లంఘించినందుకు మంగళవారం కోర్టు ముందు హాజరు కానున్న తరుణంలో ఆయన తాజా సాహసానికి పూనుకున్నారు. పత్రాల్లో నిర్దిష్టంగా ఏం ఉన్నదో తాను వెల్లడించనని, అదేవిధంగా వ్యక్తుల పేర్లుగానీ, వ్యక్తిగత కంపెనీల పేర్లుగానీ బయటపెట్టబోనని ఎల్మర్ పేర్కొన్నారు. ఈ పత్రాలను బయటపెట్టేందుకు ఎల్మర్ గత ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారని అసాంజ్ తెలిపారు. కాగా.. ఎల్మర్ గతంలో పని చేసిన బ్యాంకు అధికారులు మాత్రం ఆయన వాదనలను కొట్టిపారేస్తున్నారు. తప్పుడు పత్రాలతో తమ బ్యాంకుకు అప్రదిష్ట కల్గించేందుకు ఎల్మర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications