మంత్రి పదవులు రాకపోవడానికి రాష్ట్ర పరిస్థితులే కారణమా?

తెలంగాణ నుంచి వి. హనుమంతరావుకు, కోస్తా నుంచి కిశోర్ చంద్రదేవ్‌కు మంత్రి పదవులు ఖాయమని ఒకానొక సందర్భంగా ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వకూడదని కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోస్తా నుంచి సీనియర్ పార్లమెంటు సభ్యులు కిశోర్ చంద్రదేవ్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రాయపాటి, కావూరి బహిరంగంగానే తమకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. వారిలో ఏ ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చినా మరొకరిలో అసంతృప్తి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తా నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. కోస్తా నుంచి మరికొంత మందికి స్థానం కల్పిస్తే తెలంగాణ పార్లమెంటు సభ్యుల్లో అసంతృప్తి చోటు చేసుకునే వాతావరణం ఉంది.
తెలంగాణ నుంచి హనుమంతరావు మాత్రమే కాకుండా కేశవరావు, పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, మధుయాష్కీ గౌడ్ వంటి పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ స్థితిలో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం ద్వారా మాత్రమే సమస్య రాకుండా చూసుకోవచ్చునని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. పైగా, తెలంగాణ అంశం తీవ్రమైన సమస్యగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తగ్గిపోతుందని అనుకునే స్థితి లేదు. మరోవైపు, వైయస్ జగన్ కుంపటి రాజుకుంటూనే ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తాము జగన్ వైపు వెళ్తామని బెదిరింపులకు కూడా దిగవచ్చు. వైయస్ జగన్, తెలంగాణ సమస్యలు పరిష్కారమైతే తప్ప తెలంగాణ పార్లమెంటు సభ్యులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించే విషయం ఓ కొలిక్కి రాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications