వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం, వైయస్ పేరే ఖరారు

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలబై ఐదు రోజుల్లో తమ పార్టీ వస్తుందని వైయస్ జగన్ అప్పట్లో చెప్పారు. కానీ ఆ గడువు ఎప్పుడో దాటి పోయింది. సంక్రాంతి తర్వాత అని, మార్చి రెండో వారంలో అని వైయస్ జగన్ వర్గం నాయకులు పార్టీ స్థాపనపై చెబుతూ వచ్చారు. కానీ మార్చిలో కూడా జగన్ పార్టీ వచ్చే అవకాశాలు లేవు. జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.

మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్‌లో గానీ పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, పులివెందుల, కడప ఉప ఎన్నికల నాటికి పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లనే పార్టీ స్థాపనలో జాప్యం జరుగుతోందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. అయితే, కారణం అది కాదని తెలుస్తోంది. తెలంగాణపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే పార్టీని స్థాపించాలనేది జగన్ అభిమతమని చెబుతున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని, తెలంగాణలో అడుగు పెట్టాలంటే కేంద్రం తెలంగాణపై తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు రావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. యథాతథ స్థితి చోటు చేసుకుంది.

పార్లమెంటు సమావేశాల లోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కానీ, అది జరిగే అవకాశాలు లేవు. కాగా, రేపు శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపైనా, ప్రజారాజ్యం పార్టీతో వ్యవహరించాల్సిన తీరుపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, మంత్రివర్గంలో చేరుతుందా అనేది స్పష్టంగా తేలిన తర్వాత తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అప్పుడే జగన్ తన పార్టీ స్థాపనకు తగిన రంగం సిద్ధం చేసుకుంటారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+