చంద్రబాబుకు షాక్, ఎర్రబెల్లి దయాకర రావు రాజీనామా యోచన

తెలంగాణ ఎజెండాపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని దయాకర రావు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, పార్టీని వీడడానికి తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఆ వార్తలను నాగం జనార్దన్ రెడ్డి ఖండిస్తూ వస్తున్నారు. ఆయన కన్నా ముందుగా ఎర్రబెల్లి దయాకర రావు పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కొంత కాలంగా ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనుచరులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై చంద్రబాబుతో ఎర్రబెల్లి దయాకర రావుకు విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది. ప్రత్యేక కమిటీకి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాకుండా, తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి ఒక్కరే పనిచేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన నిజామాబాద్ జిల్లా శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డితో ఎర్రబెల్లి దయాకర రావు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications