అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆల్టిమేటం: మే వరకు గడువు

ఈ నెల 12న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర పెద్దలను రాష్ట్ర మంత్రులు కలవాలని నిశ్చయించారు. భేటీ తర్వాత లభించే హామీ, స్పష్టత ఆధారంగా తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. అప్పటివరకు శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరించాలని, ఎంపీలు పార్లమెంట్ వెలుపల నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని తీర్మానించుకున్నారు. సీనియర్ నాయకుడు కె.కేశవరావు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్, బలరాం నాయక్, రాజగోపాల్‌రెడ్డి, మధుయాస్కీ, మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ, చీఫ్‌విప్ మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామా లేఖలను మంత్రులతో పంపి సోనియాకు అందజేయాలనే అంశం చర్చకు వచ్చింది. అది మరీ తొందరపాటవుతుందని, అధిష్ఠానం ఆ రోజు ఎలా స్పందింస్తుందో తెలిసిన తర్వాత రాజీనామా లేఖలు పంపాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకుంటే నేరుగా స్పీకర్‌కే రాజీనామాలు ఇచ్చి ఆమోదింప చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 12న మరోసారి భేటీ అయి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల పదో తేదీన ఐకాస తలపెట్టిన మిలియన్ మార్చ్‌లో పాల్గొనే అంశం చర్చకు చ్చింది. ఆ రోజు తాము శాసనసభ బహిష్కరణలో ఉంటామని, తెలంగాణ సాధనలో ఎవరి కార్యాచరణ వారికి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా అంశంపై వ్యక్తిగత నిర్ణయాలు వద్దని, ఏ నిర్ణయమైనా సమష్టిగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications