తెరాస విలీనానికి, తెలంగాణకు లింక్ పెడుతున్న కాంగ్రెసు

తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు సీట్లు కాంగ్రెసుకు రావాలంటే తెరాస విలీనం తప్పనిసరి అవుతుందని, దీనిపై తమ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని తమ పార్టీ అధిష్టానం స్పష్టంగా చెప్తే విలీనానికి కెసిఆర్ అంగీకరిస్తారనే ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ తెరాస విలీనం కాకపోయినా ప్రభుత్వాన్ని మాత్రం తెరాస కూల్చబోదని ఆయన చెబుతున్నారు. తెరాస విలీనంపైనే తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసులో విలీనాన్ని తెరాస ఖండించినా జరగబోయేది విలీనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి ఏర్పాట్లు చేసుకున్న కాంగ్రెసు అధిష్టానం ఇప్పుడు తెరాస విలీనంపై దృష్టి పెట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు.
తెలంగాణపై ఏదో ఒకటి తేలిస్తేనే మంచిదని, జాప్యం చేయడం వల్ల నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంటున్నట్లు సమాచారం. తెలంగాణపై వెంటనే తేల్చేయాలని, అయితే శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రత్యామ్నాయాన్ని అంటే సమైక్యాంధ్రను తాము అంగీకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా అంటున్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల మేలో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.