చిదంబరంపై తెలుగుదేశం తెలంగాణ నేతల మండిపాటు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తప్పుల తడక అని నాగం జనార్దన్ రెడ్డి విమర్సించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. సాగునీటి వినియోగంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా తప్పుల తడకగా ఉందో ఆయన వివరించారు. చిదంబరం వ్యవహరించిన తీరు బాగా లేదని ఆయన అన్నారు. విద్యార్థుల మరణాలకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కలిసి పోరాడాలని ఆయన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిదంబరం తమ మాటలు వినడానికి కూడా సిద్దంగా లేరని, తనకు అన్నీ తెలుసునని అంటున్నారని, చిదంబరానికి ఏం తెలుసు తెలియదని ఆయన అన్నారు.
తమది తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఫోరం అని తాము స్పష్టంగా చిదంబరానికి చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం బిల్లు ప్రతిపాదించకపోతే మూల్యం చెల్లించక తప్పదని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓ కమిటీ నివేదికలోని అంశాలను వెల్లడించకపోవడమనేది జరగలేదని ఆయన అన్నారు. తాము భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రేపు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుస్తామని ఆయన చెప్పారు.