'భార్య, ఐదేళ్ల కొడుకుతో మాటల్లేవ్.. ఏడాదిగా ఇంట్లోని గదిలో ఒంటరిగా': ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
గతేడాది జూన్ 12 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విమానంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్.. అయితే ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయినా అతడు మాత్రం ఇంకా మామూలు స్థితిలోకి రాలేదు. ప్రమాదం వల్ల తనకు తీవ్ర నష్టం జరిగిందని.. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా తనను వెంటాడుతున్నాయని ఎమోషన్ అయ్యాడు. ఇప్పటికీ తాను ప్రశాంతంగా నిద్రపోవడం లేదని.. ఏదో తెలియని ఆత్రుత, జ్ఞాపకాలు తనను వెంటాడుతున్నాయని అన్నాడు.
" ప్రజలంతా నేను అదృష్టవంతుడిని బతికిపోయాను అని అంటున్నారు. కానీ ఇంట్లో నాలుగు గోడల మధ్య నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితి గురించి వారికి తెలియదు. ఈ ఘటన జరిగి సంవత్సరం దాటినా ఇంకా నా జీవితాన్ని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండలేకపోతున్నాను. నేను ఈ ప్రమాదంలో బతికినందుకు దేవుడికి కృతజ్ఞతలు.. కానీ జీవించి ఉండటమే అసలైన స్టోరీ. ఈ ఘటన జరిగినప్పటినుంచి నేను అనుభవించిన ఈ పరిణామాలు మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఫిజికల్ గా, సైకలాజికల్ గా అలాగే ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు పడ్డాను" అని తన అనుభవాలను తాజాగా పంచుకున్నాడు.
ఇక విశ్వాస్ కుమార్ రమేశ్ పరిస్థితిపై అతని ఫ్యామిలీ అడ్వైజర్ సంజీవ్ పటేల్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. " రమేశ్ ప్రస్తుతం ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అతను సీరియస్ గా ఓ ట్రామాలో ఉన్నాడు. ఆ భయాలు ఇంకా తన వెంటే తిరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన అన్ని కుటుంబాలు ప్రస్తుతం ఇలాంటి ట్రామాలోనే ఉన్నాయి. కానీ విశ్వాస్ రమేశ్ కుటుంబం పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అతను తన భార్య, ఐదేళ్ల కుమారుడితో మాట్లాడలేకపోతున్నాడు. ఒంటరిగా ఇంట్లోనే ఓ గదిలో ఉంటున్నాడు" అని సంజీవ్ పటేల్ తెలిపారు.
ఇక గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి నేటితో సంవత్సరం పూర్తయింది. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం లండన్ కు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్ పై కుప్పకూలింది.

ఈ ఘోర ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ మినహా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 241 అని తేలింది. వీరిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు, ఒక కెనడియన్ ఉన్నారు. అలాగే మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే విమానం మెడికల్ హాస్టల్ పై పడిన తరుణంలో హాస్టల్ లోని విద్యార్థులు కూడా మృతి చెందారు. అలా మొత్తం ఈ విమాన ప్రమాదంలో 271 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ఇండియా సంస్థ ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇచ్చింది.












Click it and Unblock the Notifications