హైదరాబాద్ లో భారీ వర్షం.. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం మళ్లింపు
హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్ బీ, అమీర్ పేట, బోరబండ, జూబ్లీహిల్స్ , పంజాగుట్ట, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, జేబీఎస్, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ప్రధాన కూడళ్లలో వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి వెళ్లే ఉద్యోగులు రోడ్డుపైనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా అనేకమంది మెట్రోను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ఇదిలాఉంటే హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఈ మేరకు వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా శంషాబాద్ లో విమానం ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. దాంతో విమానాన్ని అటువైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో దిగి ఈ రాత్రి అక్కడే బస చేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ వెథర్ మాన్ తన ఎక్స్ ఖాతాలో హైదరాబాద్ లో వర్షంపై కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న 2 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంబంధిత అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.

అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సైతం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications