వైయస్ జగనే ప్రధాన శత్రువు, రఘువీరా రెడ్డి కోవర్టు: జెసి దివాకర్ రెడ్డి

తాను కాంగ్రెసులో పుట్టాను, కాంగ్రెసులోనే ఉంటానని ఆయన చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీకి విధేయుడినని ఆయన చెప్పారు. రఘువీరా రెడ్డి అపర కుబేరుడని ఆయన అన్నారు. ఎన్నిక కోసం మద్దతు కూడగట్టకుండా రఘువీరా రెడ్డి ఎసి గదిలో కూర్చున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రాజకీయాల చిట్టాను జెసి విప్పారు. కళ్యాణదుర్గం నుంచి రఘువీరా రెడ్డి టికెట్ ఇప్పించింది తానే అని, తానే రఘువీరాను గెలిపించానని ఆయన అన్నారు. మంత్రి శైలజానాథ్ తన కృషి లేకుండా గెలిచేవారు కాదని ఆయన అన్నారు. రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని, తాను కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిస్తానని ఆయన చెప్పారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారని, అయితే రఘువీరా రెడ్డి తనపై దుష్ప్రచారం చేసి తనకు మంత్రి పదవి రాకుండా చేశారని ఆయన విమర్శించారు. ఓ పెద్ద మనిషి తనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారని, తాను విషపురుగో రఘువీరా విషపు పురుగో తేల్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కాళ్లా వేళ్లా పడి పనులు చేయించుకోవడం రఘువీరా రెడ్డికి అలవాటు అని ఆయన అన్నారు. తన మద్దతుదారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఓటేశారని ఎవరు చెప్పారని ఆయన అడిగారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓటమికి రఘువీరా రెడ్డే కారణమని ఆయన అన్నారు.