కాంగ్రెసు పార్టీ ఇమేజ్ దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ తీరు?

ఆయన బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుందని అధిష్టానం చెప్పింది. అయితే ఆ పదవిని ఎవరికి ఇవ్వకుండా కిరణ్ అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి రేసులు తెలంగాణకు చెందిన దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి పేర్లు బాగానే వినిపించినప్పటికీ సిఎం మాత్రం ఆ పోస్టులను అడ్డుకున్నట్టుగా సమాచారం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రెండుసార్లు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. ఇప్పటి వరకు స్పీకర్ లేడు. అందులోనూ సిఎం నిర్లిప్తంగా ఉన్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉపసభాపతిగా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నేతలంతా భావిస్తున్నప్పటికీ సిఎం మాత్రం తనకు అనుకూలురైన వ్యక్తి కోసం దానిని వాయిదా వేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిలో తెలంగాణ వారిని అడ్డుకున్న ముఖ్యమంత్రే స్పీకర్ పదవిని తన వారికి అప్పగించడానికి తెలంగాణ సెంటిమెంటును బయటకు తీసుకు రావడం విశేషం. సిఎం సూచించిన వ్యక్తికి అధిష్టానం మొండి చేయి చూపించడంతో ఆరునెలలుగా సిఎం దానిని భర్తీ చేయకుండా ఆలాగే ఉంచుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్పీకర్ పోస్టు పెండింగ్‌లో ఉండటం వల్ల డిప్యూటీ స్పీకర్ పోస్టు అలాగే కొనసాగుతూ ఉంది.
ప్రధాన పోస్టుల భర్తీలో అడ్డుకుంటూ ముఖ్య నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిల్చిన ముఖ్యమంత్రి జిల్లా, గ్రామీణ స్థాయి నేతల్లోనూ సంతృప్తిని కలిగించ లేక పోతున్నారు. ఆయా ప్రాంతాలలో ఉండే నామినేటెడ్ పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చేయకుండా స్థానిక నేతలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమం సందర్భంగా ఆయన ఓ సమయంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆ మాట ఇచ్చి నెలలు గడుస్తున్నా ఆ ఊసు లేదు. ఓ పార్టీ అన్నప్పుడు సాధారణంగా అసంతృప్తులు ఉండటం మామూలే. అయితే పూర్తిస్థాయిగా ఇటు నేతలను, అటు కార్యకర్తలను అసంతృప్తికి గురి చేసిన ఘనత మాత్రం కిరణ్ కుమార్‌దే అంటున్న వాదనలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, చాలా విషయల్లో ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికలు అయినా మరే విషయం తీసుకున్నా ముఖ్యమంత్రి తన సొంత నిర్ణయాలే తీసుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఏం చేయాలనుకున్నాడో అది చేస్తాడు, అంతేనా చేసే వరకు ఎవరికీ చెప్పడు అనే ధోరణిలో సిఎం తీరు ఉందని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సెలక్ట్ చేశారంట. కానీ ఆ పేర్లు మాత్రం ఎవరికీ తెలియదంట. పార్టీ నేతలతో చర్చించకుండా గుట్టుగా అన్నీ చేసుకుంటూ పోవడం వల్ల నేతలలోనూ ముఖ్యమంత్రిపై తీవ్ర అసంతృప్తి సెగ రగులుతున్నట్టుగా సమాచారం. ఇక ఇటీవల జరిగిన కడప, పులివెందుల ఉప ఎన్నికలలో కూడా ముఖ్యమంత్రి పదిహేను రోజులకు ముందు మాత్రమే ఆయా మంత్రులకు ఆదేశాలు పంపించారంట. జగన్ రాజీనామా చేసినప్పుడే ఎన్నికలు ఖాయమని తెలిసినప్పుడు, ముందుగానే స్థానిక నేతలు, కార్యకర్తలతో మమేకం కాకుండా అప్పటికప్పుడు వెళ్లి మంత్రులు చేసేదేముంటుంది. మొత్తానికి ముఖ్యమంత్రి వైఖరి మాత్రం ఇటు నేతల్లో, అటు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని రగులుస్తుందంటా.












Click it and Unblock the Notifications