నాగం జనార్దన్ రెడ్డి ఇష్యూ: చంద్రబాబుకు భయమా, డైలమానా?

నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకునే విషయంలో చంద్రబాబు డైలమాలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో చంద్రబాబు కన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కే విశ్వసనీయత ఎక్కువగా ఉందని నాగం జనార్దన్ రెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యపై పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణ అంశంపై కూడా నాగం జనార్దన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకునే విషయంలో తెలంగాణ నాయకుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదని తెలుస్తోంది.
మోత్కుపల్లి నర్సింహులు లాంటి నాయకులు నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. అయితే, నాగం జనార్దన్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవూరి ప్రకాశ రెడ్డి వంటి నాయకులు చర్యలకు సుముఖంగా లేరని తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే చంద్రబాబుపై తెలంగాణలో వ్యతిరేకత మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సంశయం చంద్రబాబును వెనక్కి లాగుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications