చంద్రబాబుకు దిమ్మ తిరిగే దెబ్బ, కడప ఫలితాలు తెచ్చిన తంటా

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఓట్లు చీలి తాము రెండో స్థానంలోనైనా నిలుస్తామనే ఆశలు పటాపంచలయ్యాయి. కాంగ్రెసు అభ్యర్థులు పెద్దగా ఓట్లు సాధించకపోయినా పోటీ మాత్రం కాంగ్రెసుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లోకి పెద్ద యెత్తున వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందనే భావన బలంగా నాటుకునే అవకాశం ఉంది. ఇది చంద్రబాబుకు నష్టం కలిగించే విషయమే.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బ తినే వాతావరణం ఉంది. పార్టీలో తెలుగుదేశం నాయకుల మధ్య తగాదాలు, తెలంగాణపై స్పష్టం కాని చంద్రబాబు వైఖరి తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. సీమాంధ్రలో వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీలు మాత్రమే పోటీ పడతాయనే వాతావరణం బలపడే అవకాశం ఉంది. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు పుంజుకోవచ్చు. స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ కూడా ఊపందుకునే అవకాశం ఉంది. దీనికి తగినట్లు తెలంగాణలో నాగం జనార్దన్ రెడ్డి, పార్టీ మొత్తంలో నందమూరి హరికృష్ణ చంద్రబాబుపై పోరును తీవ్రం చేస్తారని అంటున్నారు. కడప ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ఆశలు మొదటి నుంచీ లేనప్పటికీ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య ఓట్లు చీలి తెలుగుదేశం పార్టీ లాభపడుతుందని చెప్పడానికి అవసరమైన సంకేతాలను ఉప ఎన్నికలు అందించలేకపోయాయి. ఇదే చంద్రబాబుకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications