అటు చంద్రబాబు, ఇటు కెసిఆర్: ఇద్దరు ఉద్దండులతో నాగం ఫైట్

కానీ తన నియోజకవర్గం నాగర్ కర్నూల్‌లో మొదటిసారి తాను నిర్వహించిన బహిరంగ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్, ఇతర జేఏసీ నాయకులు రాకపోవడం ఆయనలో ఆగ్రహానికి దారితీసింది. కెసిఆర్ ఒత్తిడి వల్లే వారు దూరంగా ఉన్నారని నాగం బలంగా విశ్వసిస్తున్నారు. దీనితో మొదటిసారి ఆయన బహిరంగంగా కోదండరాంపై ధ్వజమెత్తారు. ఆయన టీఆర్ఎస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీ ఎజెండాను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని నాగం ఆరోపించారు. ఉద్యోగ సంఘాలు ఒక పార్టీకి అనుబంధంగా ఉంటున్నట్టు వ్యవహరించరాదని, ఉద్యమంలో ఉన్నవారందరికీ మద్దతు ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తూ జేఏసీ నిర్ణయం తీసుకొన్న తీరును కూడా తప్పుబట్టారు.
తాను నాగర్ కర్నూల్‌లో సభ పెట్టడంతో గడగడలాడిపోయిన కెసిఆర్ వెంటనే ఒక్క రోజులో ఉద్యమ కార్యక్రమం ప్రకటించారని, పార్టీరహితంగా తాను నిర్వహించిన సభలతో కెసిఆర్ సహా చాలా మందికి చెమటలు పడుతున్నాయని ఆయన ఆంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో నాగం తన సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైనా సమరం కొనసాగిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో చేసిన తీర్మానాన్ని కేంద్ర హోం మంత్రి చిదంబరానికి చంద్రబాబు పంపాలని, అలా పంపితేనే తాను నిర్వహిస్తున్న సభల్లో పార్టీ జెండా, అధ్యక్షుడి ఫొటో పెడతానని ఆయన తాజాగా ప్రకటించారు. లేకపోతే పార్టీరహితంగానే తన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్టీ అనుకూలమని అధ్యక్షుడు బహిరంగంగా ప్రకటించాలని, అప్పుడే తెలంగాణలో పార్టీ బతుకుతుందని అంటున్నారు. పార్టీలోని సీమాంధ్ర నేతలు ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తారని తెలిసినా, నాగం తన వాదన కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణపై పార్టీ స్పష్టత ఇస్తేనే కడప ప్రచారానికి వెళ్తానని ఆయన కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తర్వాత దానిని కొంత సవరించుకొని ఇక్కడ ఉద్యమ అవసరాల రీత్యా వెళ్లడం లేదని చెప్పారు. తెలంగాణకు పార్టీ ప్రత్యేక శాఖ కావాలని అంతకు ముందు కొంతకాలం ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పార్టీ అధ్యక్షుడితో కూడా పోరాడుతున్నారన్న అభిప్రాయం కలిగితేనే ప్రజల్లో తన ఇమేజీ పెరుగుతుందని ఆయన భావన. పార్టీ నుంచి బయటకు వెళ్తే తెలంగాణలో ఆయనకు టీడీపీ దూరమవుతుంది. దానిని పోగొట్టుకోకుండా, అదే సమయంలో తన ఇమేజీ తగ్గకుండా చూసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications