రణరంగంగా కరీంనగర్ రణభేరీ, 12 మంది టిడిపి శాసనసభ్యుల గైర్హాజర్

రణభేరీ బహిరంగ సభలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులంతా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినా 12 మంది గైర్హాజయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారిలకు ఆహ్వానాలు వెళ్లలేదు. అంటే, మరో 8 మంది ఈ బహిరంగ సభకు దూరంగా ఉన్నారని అర్థం. కాగా, కరీంనగర్ కమాన్ వద్ద తెలుగుదేశం నాయకులపైకి తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. దీనిపై తెలుగుదేశం నాయకులు రమణ, పెద్దిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే, తెలంగాణ రణభేరీకి బయలుదేరిన శానససభ్యుడు మైనంపల్లి హనుమంతరావు, నాయకుడు బాబూ మోహన్ వాహనాన్ని అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. ఈ సమయంలో తెరాస కార్యకర్తలకు, మైనంపల్లి అనుచరులకు మధ్య ఘర్షణ చెలరేగింది. అంతకు ముందు బెజ్జంకి వద్ద తెలుగుదేశం నాయకుల కాన్వాయ్‌పైకి తెలంగాణవాదులు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి కారుపై రాళ్లతో తెలంగాణవాదులు దాడి కూడా చేశారు. కరీంనగర్ తెలుగుదేశం పార్టీ కార్యలయానికి దుండగులు నిప్పు పెట్టారు.
తెలంగాణ రణభేరీ బహిరంగ సభ వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. పెద్ద యెత్తున తెరాస కార్యకర్తలను, తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా, తెలంగాణ రణభేరీకి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. రణభేరి వేదికకు దగ్గరలోనే తెలంగాణవాదులు, తెరాస కార్యకర్తలు నిరసనకు దిగారు. తీవ్రమైన ఉద్రిక్తత మధ్య తెలంగాణ రణభేరీ బహిరంగ సభ ప్రారంభమైంది.