ప్రభుత్వాన్ని కూల్చుతామని జగన్ అనలేదు: కొణతాల రామకృష్ణ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తానే ప్రభుత్వాన్ని కూల్చుతానని ఎప్పుడూ అనలేదని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి తన సవాళ్లతో ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీని ఇరుగున పెట్టిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తానే ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. గురువారం తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి సిద్ధం కావడంతో జగన్ వర్గం ఖంగు తిన్నది. వైయస్ జగన్ ఎప్పుడు కూడా తనతో ప్రభుత్వాన్ని కూలదోల్చే సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పలేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని మాత్రమే చెప్పారని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలను నీరుగార్చుతున్న కాంగ్రెసు ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమర్థిస్తుందని చెప్పారు. తమ పార్టీకి ఒకరే ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. జగన్‌కు మద్దతు తెలుపుతున్న వారంతా కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అని వారు ఎవరికి మద్దతు ఇస్తారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారు తమ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని కోరారు. మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి అవిశ్వాసం పెట్టలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా పెట్టారా లేదా అనే విషయం మరో నాలుగు రోజుల్లో తెలుస్తుందని అన్నారు.