కెసిఆర్ బాటలో నాగం: ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచన?

గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కోసం అంటూ మాట్లాడే సమయాల్లో వారు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారి బాటలోనే నాగం తాను కూడా రాజీనామా చేసి స్వతంత్రంగా గెలవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి అనుసరిస్తోన్న రెండు కళ్ల సిద్ధాంతంపై విరుచుకుపడి ఆయన బహిష్కరించబడిన తర్వాత పార్టీపై, పార్టీ నేతపై మరింత ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయత పెరిగి పోయింది. ఆయన కెసిఆర్‌కు ధీటుగా ఎదిగే విధంగా కూడా కనిపిస్తోంది. ఇక ఆయన రాజీనామా చేసి మళ్లీ స్వతంత్రంగా పోటీ చేస్తే తెలంగాణవాదుల నుండి ఆయనకు మరింత మద్దతు తప్పకుండా వస్తుందనేది నాగం వర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తన పదవికి రాజీనామా చేసి వస్తేనే నాగంను నమ్ముతామని జెఏసి కూడా ప్రకటించింది.
రాజీనామా ద్వారా తనకూ నైతిక విలువలున్నాయని, పదవి పోయినా ప్రజల అండతో మళ్లీ గెలుస్తానన్న సంకే తాలు ఇచ్చేందుకు సిద్దమవడానికే నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. బహుశా మరి కొన్ని రోజుల్లో ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన స్పీకర్ ఎన్నికలో పాల్గొని టిడిపి విప్‌ను ధిక్కరించకుండా కెఇ కృష్ణమూర్తికి అనుకూలంగా ఓటు వేశారు. ఆ సమయంలో నాగంపై కొద్దిగా విమర్శలు వచ్చాయి. పదవి కోసం విప్‌ను ధిక్కరించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు రాజీనామా చేస్తే తనకు పదవి ముఖ్యం కాదనే భావన ప్రజల్లోకి తీసుకు వెళ్లవచ్చని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications