దామోదర తెలంగాణ మిషన్, ఢిల్లీకి ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఐదు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లారు. అధిష్ఠానం పెద్దలతో అనేకసార్లు సమావేశమయ్యారు. తనకు అప్పగించిన 'మిషన్'ను పూర్తి చేసేలా ఆయన కదులుతున్నట్టు కనిపిస్తోంది. సీమాంధ్రకు చెందిన ఎంపీలు జేడీ శీలం, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌లతోనూ రాజనరసింహ భేటీ అయ్యారు. "తెలంగాణపై మా పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయం ప్రాంతీయ మండలి అయినా సరే!'' అని ఆయన అనడం ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజ నరసింహ మంగళవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆ వెంటనే బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈ ప్రయాణానికి కేవలం కొన్ని గంటల ముందు సీఎం మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఎస్సై పోస్టుల పరీక్ష గురించి ఆయనతో చర్చించినట్లు తెలిసింది. సీఎం కిరణ్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హైదరాబాద్‌లో దిగనున్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ సారథి బొత్స సత్యనారాయణ కూడా హల్‌చల్ సృష్టిస్తున్నారు. 'సలహాదారు' కేవీపీ రామచంద్రరావును ముఖ్యమంత్రి కలిసి చర్చించిన రెండో రోజునే బొత్స కూడా ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు. పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఇంటికి వెళ్లి విందు సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, గీతారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, బస్వరాజు సారయ్య, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగతోనూ బొత్స చర్చలు జరిపారు. కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, బొత్స సత్యనారాయణ తెలంగాణ అంశంపై పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం పని చేస్తున్నట్లు అర్థమవుతోంది.