భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
సుమారు రూ.85,000 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా
తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విస్తరణ నిర్ణయం తీసుకుందని హైడ్రా కమీషనర్ పేర్కొన్నారు.హైడ్రా తన కార్యకలాపాలతో ఇప్పటివరకు సుమారు రూ.85,000 కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు ఆయన ప్రకటించారు. మరో సంవత్సరంలోగా రూ.1లక్ష కోట్లు విలువైన భూములను రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

హైడ్రాకు వేలాది ఫిర్యాదులు
హైడ్రా పరిధిలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఉందని కమిషనర్ వెల్లడించారు. భూ కబ్జాలకు సంబంధించి హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ అంకితభావంతో, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా హైడ్రా 'ప్రజావాణి' కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
నేరుగా అధికారులను కలిసి ఫిర్యాదు చేయమన్న హైడ్రా కమీషనర్
జూన్ 8వ తేదీ నుంచి 'ప్రజావాణి' తిరిగి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ మార్గాల ద్వారా అందిన ఫిర్యాదులన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి, ఆలస్యాన్ని నివారించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని హైడ్రా కమీషనర్ రంగనాథ్ వివరించారు. గతంలో ఫిర్యాదు చేసినవారు తమ సమస్య అత్యవసరమైనదని భావిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా అధికారులను కలవవచ్చని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.
హైడ్రా నిర్ణయంతో భూకబ్జాదారుల గుండెల్లో రైళ్ళు
కొత్తగా ముఖ్యమైన సమస్యలున్న వారైనా సరే, కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించామన్నారు. మరోవైపు, హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏది ఏమైనా హైడ్రా కమీషనర్ రంగనాధ్ తాజాగా చెప్పిన విషయం భూకబ్జా దారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తుంది.













Click it and Unblock the Notifications