చిరుపై వ్యతిరేకత వల్లనే దాసరి దూరంగా ఉన్నారా?

నిజానికి, చిరంజీవి కాంగ్రెసుకు దగ్గరవుతున్న క్రమంలోనే దాసరి నారాయణ రావు దూరమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందనే అభిప్రాయం బలంగా ఉంది. చిరంజీవికి వ్యతిరేకంగా దాసరి నారాయణరావు ఎన్నికల సమయంలో మేస్త్రీ అనే సినిమా కూడా తీశారు. చిరంజీవిని ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారని అంటారు. దాసరి నారాయణరావుపై చిరంజీవి కుమారుడు, సినీ హీరో రామ్ చరణ్ తేజ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాసరి నారాయణరావుపై చిరంజీవికి తీవ్ర వ్యతిరేకత ఉన్నందు వల్లనే రామ్ చరణ్ నుంచి అటువంటి వ్యాఖ్యలు వెలువడ్డాయనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెసులో చిరంజీవి తన ప్రాబల్యం పెంచుకుని దాసరి నారాయణరావు ప్రాబల్యం తగ్గించే ఎత్తుగడలో భాగంగానే అలా జరిగిందని చెబుతున్నారు. కాగా, సోమవారం విలీన సభలో చిరంజీవి గాంధీ టోపీ ధరించారు. ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. కాపు సామాజిక వర్గానికి చిరంజీవి కాంగ్రెసులో నాయత్వం వహించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకు దాసరి నారాయణరావును దూరంగా ఉంచడం ఆయనకు అవసరంగా మారిందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications