జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్ జగన్ వైపు?

సొంత పార్టీ నేతలనే జీవన్ రెడ్డి లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఆయనకు వ్యూహాలు ఉండి ఉండవచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జీవన్ వైయస్సార్‌కు చాలా సన్నిహితుడు. ఆ కారణంగా వైయస్ సూచనలతో పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై రెండుసార్లు జీవన్ రెడ్డి పోటీ చేశారు. వైయస్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన కాంగ్రెసు కంటే జగన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఉండుంటే జీవన్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపే వారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమం ఉధృతంగా నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోనుందనే జీవన్ వైయస్సార్సీ పార్టీలో చేరే అంశంపై ఆలోచించడం లేదని, భవిష్యత్తులో జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా లేక సమస్య పరిష్కారమైనా జీవన్ జగన్ వెంట వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరుల పైనా ఇలాంటి అనుమానాలే ఉన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో జగన్ సమావేశాలకు వారు లోపాయికారిగా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన నేతలకు భిన్నాంగా కోమటిరెడ్డి సోదరులు తెలంగాణ అంశంపై అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీరు కూడా తెలంగాణ అంశం కారణంగానే జగన్‌తో వెళ్లేందుకు వెనకాడుతున్నారని లేదంటే ఎప్పుడో ఆయన వర్గంలో చేరి పోయే వారనే ఆరోపణలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి సైతం గ్యారెంటీ లేదు. అంతేకాకుండా దివంగత వైయస్ అండతో ఔటర్ రింగు రోడ్డు వ్యవహారంలో కోమటిరెడ్డి సోదరులు, బంధువులు లబ్ధి పొందినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పలు కారణాల వల్ల ఎప్పటికైనా వారు జగన్‌తో వెళ్లే వారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ పార్టీలో చేరే వాదనలను మాత్రం వారు ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications