ఎమ్మెల్సీకి రోశయ్య రాజీనామా: రేసులో డి శ్రీనివాస్

సామాజిక, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ఈ సీటు భర్తీ కోసం అధిష్టానం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనమండలిలో ఇప్పటి వరకు బిసిలలోని చేనేత వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ వర్గాల్లో అసంతృప్తి ఉంది. దీంతో ఆ వర్గం నుండి బూదాటి రాధాకృష్ణయ్యను ఎంపిక చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రోశయ్య ఆంధ్రా ప్రాంతం వ్యక్తి. రాధాకృష్ణయ్య సైతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో రాధాకృష్ణయ్య వైపే పార్టీ మొగ్గే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన ఈ సమయంలో తెలంగాణ వారికి ఇచ్చే అవకాశాలనూ కొట్టి పారేయలేము. మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పేరునూ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులను చల్లబర్చడానికి ఇటీవల దళిత వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అలాగే బిసి వర్గానికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. కిష్టారెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్ రావు తదితరుల పేర్లనూ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అత్యధికంగా ఉన్న బిసి ఓట్లు టిడిపి, జగన్ వైపు మళ్లకుండా చూసేందుకు ఆ వర్గాలకే అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications