గాంధీ జయంతి అక్టోబర్ 2 నుండి కెసిఆర్ నిరాహార దీక్ష?

తమ తండ్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడినట్లు వచ్చిన వార్తలు నిజమేనని కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు, కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం వేరు వేరుగా ధృవీకరించారు. కెసిఆర్ మరో దఫా ఆమరణ దీక్ష చేస్తానని కుటుంబ సభ్యులతో చెప్పారని కెటి రామారావు అన్నారు. సోమవారమే దీక్ష చేస్తానని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులమైనా తామే వద్దన్నామన్నారు. వ్యక్తిగతంగా మేం వద్దని చెబుతున్నప్పటికీ తెలంగాణ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. నిన్నటి సంఘటనలు కెసిఆర్‌ను తీవ్రంగా కలచి వేశాయన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు నేతలు విద్యార్థులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించినా స్పందించక పోవడాన్ని ఆయనను బాగా కలచి వేశాయన్నారు. అయితే ఇప్పటి వరకు అంతిమంగా నిర్ణయం తీసుకోలేదని నిర్ణయం తీసుకుంటే పార్టీ ప్రకటిస్తుందన్నారు.
కెసిఆర్ మొండి వ్యక్తని ఆయన అనుకున్న దానిని ఖచ్చితంగా చేస్తారన్నారు. అయితే పరిస్థితులు, ఆరోగ్యం దృష్టా తమతో పాటు పలువురు వద్దుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటి మూర్ఖులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీక్షకు పోక పోవడమే మంచిందన్నారు. కెసిఆర్‌ను వదిలించికునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇప్పుడు కాకున్నా మరికొన్ని రోజులకు వస్తుంది. ఇప్పుడు తెలంగాణకు ద్రోహం చేస్తున్న వారికి ప్రజలు అప్పుడు బుద్ధి చెబుతారన్నారు. నాన్న చేసే ప్రతి ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని దీక్ష చేపట్టవద్దని తాము కోరుతున్నామన్నారు. అయితే రెండో దఫ దీక్ష కుటుంబంలో చర్చకు వచ్చిన మాట మాత్రం నిజమే అన్నారు. ఈ సారి తన దీక్షను నిజామాబాద్ జిల్లాలో చేయాలని చూస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications