అవసరమైతే దీక్ష చేస్తాను: టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్

తెలంగాణలోని ప్రతి వ్యక్తి సమ్మెలో పాల్గొంటున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమ్మె ఎనిమిదో రోజుకు చేరిన కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. నిజాం కళాశాల విద్యార్థులపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రౌడీల్లా ప్రవర్తించిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అని అడిగారు. తెలంగాణ రావటం ఖాయమని సర్కారు కుట్రలకు లొంగేది లేదన్నారు. ఎపి ఖజానాకు వచ్చే ఆదాయంలో 73 శాతంకు పైగా తెలంగాణ నుండే అన్నారు. ఆంధ్రా పదమూడు జిల్లాల నుండి వచ్చే ఆదాయం కంటే తెలంగాణ 9 జిల్లాల నుండి వచ్చే ఆదాయం చాలా ఎక్కువ అన్నారు. తెలంగాణ ప్రజలు పన్నులు కడితే రాయలసీమ వారు ఎగ్గొడతారని విమర్శించారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతం వారు సొమ్మొకడిది సొకొకడిది అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
120 కోట్ల మంది సాక్షిగా కేంద్రం చేసిన ప్రకటన అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాకపోతే బానిసల్లా బతకాల్సి ఉంటుందన్నారు. ఆరునూరైనా తెలంగాణ సాధించడమే మనముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు బుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. మొదట రాజీనామా చేయడానికి ముందుకొచ్చిన టిడిపి, కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు మరోసారి రాజీనామా చేయమంటే వెనక్కి పోయారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం రెండువందల ఏళ్లు పోరాటం చేశారని అందులో తరతరాలు పోరాడి సాధించుకున్నారని అదే స్ఫూర్తిగా మనం సైతం తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ కోసం అందరం ఐక్యమయ్యామని దానిని కాపాడుకుంటూ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా అంతకుముందు కెసిఆర్ మరోసారి నిరాహార దీక్షకు దిగుతున్నారనే సంకేతాలు వచ్చిన విషయం తెలిసిందే. కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు, తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం దీక్షపై సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆరోగ్యం దృష్ట్యా దీక్ష వద్దని ఇంట్లో వాళ్లం చెబుతున్నామని అయినా కెసిఆర్ వినిపించుకోవడం లేదని చెప్పారు. టిఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ సైతం కెసిఆర్ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారని ఆయన అనుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు కెసిఆర్ ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications