చెప్పులు లేకుండా వచ్చి కోటీశ్వరులయ్యారు: కెసిఆర్

లగడపాటి లాగా ఆ రోజు సీమాంధ్ర నాయకులు మాట్లాడితే రానిచ్చేవారా అని ఆయన అడిగారు. కాళ్లకు చెప్పులు లేకుండా హైదరాబాదు వచ్చి సంపన్నులయ్యారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు లాభడపడ్డారు తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, హైదరాబాదుకు ఏమీ చేయలేదని ఆయన అన్నారు. ఆసలు హైదరాబాదును ఏం అభివృద్ధి చేశారని, అభివృద్ధి అంటే భౌగోళిక విస్తరణ మాత్రమే కాదని, అందరూ సౌఖ్యంగా బతకేలా చేసేదే అభివృద్ధి అని ఆయన అన్నారు.
తెలంగాణ ఎగువ ప్రాంతంలో ఉంది నీళ్లు రాబోవని అంటారని, మెదడు మోకాళ్లలో లేనివారు అలా అంటూ వస్తున్నారని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కాగితాల మీద ఉంటాయి గానీ నీళ్లు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు ముఖ్యమంత్రులకు డూడూ బసవన్నలుగా మారారని ఆయన అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు కోసం పనిచేయడానికి తెలంగాణ ఉద్యోగులు వెళ్తే రాయలసీమవారు బెదిరించారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు చెందిన 83 వేల ఉద్యోగాలు సీమాంధ్రులు కొల్లగొట్టారని, కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో జారీ అయిన 39 నెంబర్ జీవో, ఎన్టీ రామారావు ప్రభుత్వం జారీ చేసిన 610 జీవో అమలు కాలేదని, ఆ తర్వాత వేసిన ఇతర కమిటీల నివేదికలు కూడా అమలు కాలేదని ఆయన అన్నారు.
కమిటీలు, కథలు, కాలక్షేపాలే తప్ప అన్యాయాన్ని మానుకోరని ఆయన విమర్శించారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రం తప్ప మరోటి వద్దని పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. పోరాటం చేస్తుంటే తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ మర్మాంగాలపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఒక నాయకుడిని చంపితే పోరాటం ఆగుతుందా అని ఆయన అడిగారు. తెలంగాణను ఆంధ్రలో కలపాలని వేడుకున్న నాయకులు మాట్లాడిన తీరు చూస్తుంటే పరిస్థితి మనకు అర్థమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించకపోతే పాతాళానికి తొక్కుతారని, ఆరు నూరైనా నూరు ఆరైనా తెలంగాణ సాధించుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications