బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఈ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. క్రమంగా తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం.. పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై అధికంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ దక్షిణం, ఒడిశా ఉత్తర ప్రాంతం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా మారే ప్రమాదం ఉన్నందున 24 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ కేంద్రం సూచించింది.
ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయినప్పటికీ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలకు దారి తీయవచ్చని పేర్కొంది. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, దాని పరిసరాల్లో ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. దీనికి తోడు వాయుగుండం ప్రభావం జతకావడంతో దక్షిణ బెంగాల్ అంతటా సోమ, మంగళవారం నుంచి వర్షాలు దంచికొట్టనున్నాయి.
వచ్చే రెండు రోజుల్లో దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్ వంటి తీరప్రాంత జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాలతో పాటు కోల్‌కతా, హౌరా, హుగ్లీ, బాంకురా, ఝార్ గ్రామ్ జిల్లాల్లోనూ పలు చోట్ల తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కోల్‌కతాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా 28 డిగ్రీలుగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంది.
సోమ, మంగళవారం నుంచి భారీ వానలు విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు అలీపూర్ లోని రీజినల్ ఐఎండీ తెలిపింది. పశ్చిమ, తీరప్రాంత జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఆ ప్రాంతాలకు ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. పశ్చిమ బెంగాల్ తో సరిహద్దులను పంచుకుంటోన్న ఒడిశా జిల్లాలపైనా ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని, బాలాసోర్, భద్రక్, మయూర్ భంజ్, సుందర్ గఢ్, కియోంఝార్ వంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని ఆర్ఐఎండీ వివరించింది.




Click it and Unblock the Notifications