ఆరోపణల దండకాలు: రామోజీ వర్సెస్ జగన్ సాక్షి

రామోజీ రావుకు వ్యతిరేకంగా సంభవించే ప్రతి పరిణామానికి సాక్షి దినపత్రిక ప్రాధాన్యం ఇస్తుండగా, జగన్‌పై జరుగుతున్న విచారణలపై ఈనాడు వార్తాకథనాలను ప్రచురిస్తోంది. సోమవారం ఇరు పత్రికల్లో ప్రచురితమైన వార్తాకథనాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో రామోజీ రావు ప్రయోజనం పొందారని, అక్రమాలకు పాల్పడ్డారని సాక్షి దినపత్రిక కోడై కూస్తోంది. చంద్రబాబుపై సిబిఐ విచారణకు సంబంధించిన వార్తను ఈనాడు లోపలి పేజీలో కనిపించీ కనిపించకుండా ప్రచురించి, వైయస్ జగన్‌పై పాత ఆరోపణలతో కూడిన పాత వార్తాకథనాన్ని పతాక శీర్షిక కింద ప్రచురించారని విమర్శిస్తూ సాక్షి డైలీ సోమవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు ఆస్తుల కేసులో రామోజీ రావుపై కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, సిక్కిం రాష్ట్రంలోనూ విద్యుత్ ప్రాజెక్టును వైయస్ జగన్ పవర్ ప్రాజెక్టును సొంతం చేసుకున్న వైనంపై ఈనాడు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఇంతకు ముందు మీడియాపై రాజకీయ నాయకులు విమర్శలు చేయడానికి వెనకాడేవారు. ఇప్పుడు రామోజీరావుపై నిత్యం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాధాన్యం ఇచ్చి వాటిని సాక్షి దినపత్రిక ప్రచురిస్తోంది. వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా నిరంతర పోరాటం సాగిస్తోంది. ఈ రెండు పత్రికలను, చానెళ్లను ఎల్లో మీడియాగా సాక్షి దినపత్రిక వ్యాఖ్యానిస్తోంది. ఒక పత్రికలోని వార్తాకథనాలు మరో పత్రికకు ముడిసరుకుగా మారడం కూడా కొత్త పరిణామమే.












Click it and Unblock the Notifications