తెలంగాణపైనే: కెసిఆర్‌తోనూ కాంగ్రెసు పెద్దల చర్చలు

ఇందులో భాగంగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో మాట్లాడినట్లు చెబుతున్నారు. అహ్మద్ పటేల్‌తో మూడో కంటికి తెలియకుండా ఫోన్‌లో మాట్లాడడానికి కెసిఆర్ మెదక్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్‌లో మకాం వేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, కెసిఆర్‌తో అహ్మద్ పటేల్ మాట్లాడినట్లు వస్తున్న వార్తలను తెరాస వర్గాలు ధ్రువీకరించడం లేదు. ఇటీవల పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కూడా తెలంగాణపై చర్చించేందుకే ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. డిఎస్ సోనియాను, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను, కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు.
తెలంగాణ అంశాన్ని తేల్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆజాద్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఏం చేద్దామనే అంశంపై కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రం బొత్స సత్యనారాయణ కూడా ఢిల్లీకి వస్తారు. ఆయనతో కూడా చర్చించిన తర్వాత తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుని వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications