అనంతపురం: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అగిసం వీరప్ప ఆదివారం ఉదయం మృతి చెందారు. వీరప్ప గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు ఎనబై ఎనిమిది. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, జలగం వెంగళ రావు హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. వివిధ శాఖల్లో పని చేశారు. జిల్లాలో ఆయన బిసి నాయకుడిగా పేరు పొందారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఆమె ప్రసంగాలను వీరప్పే అనువాదం చేసేవారు.
వీరప్ప మృతికి మంత్రులు శైలజనాథ్, రఘువీరా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు తమ సంతాపం ప్రకటించారు. కాగా ఆయన అభిమానులు ఆయనను రాయలసీమ టైగర్‌గా పిలుస్తారు.