తెరాస ఖాళీ అవుతుంది, ఇదే ఆఖరు: చంద్రబాబు

2009 ఎన్నికల్లో తెరాసతో తాము పొత్తు పెట్టుకోకపోయి ఉంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని అన్నారు. 2009 ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు జరిపి లాలూచీ పడిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణలో తెరాస ద్వారా, ఆంధ్రాలో చిరంజీవి ద్వారా తమ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. సినిమా డైలాగులు చెప్పుకొనే చిరంజీవి కాంగ్రెస్ కంపు గుంపులో కలిశారని విమర్శించారు. 30 ఏళ్లుగా టీడీపీ ఏనాడూ రాజీ పడలేదని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పోరాడుతోందని అన్నారు. డబ్బులకు లాలూచీ పడి జగన్‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారన్నారు.
కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే బీడీ కట్టపై 'పుర్రె' గుర్తు వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై తాను తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తే దాడులు చేశారని, జగన్‌కు మాత్రం స్వాగతం పలికారని తెరాసపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత అభివృద్దిపై చర్చకు సిద్ధమా? అంటూ తాను అనేక సార్లు సవాల్ చేసినా కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ముందుకు రావడం లేదన్నారు. మద్యం ముడుపులపై కేసీఆర్ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.