చివరి మరణం కావాలి, పోరాడేందుకు వెళ్తున్నా: కెసిఆర్
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ కోసం బోజ్యా నాయక్‌దే చివరి మరణం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బోజ్యా నాయక్ ఆత్మహత్య తనను ఎంతో కలచి వేసిందన్నారు. సీమాంధ్ర నేతలు ఆత్మహత్యలకు స్పందించరని మండిపడ్డారు. ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ కోసం బోజ్యాదే చివరి మరణం కావాలన్నారు. విద్యార్థులు, యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆత్మహత్యలు కాకుండా బతికి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో, కేంద్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. తాను ఢిల్లీ వెళ్లి పార్లమెంటును ఆత్మహత్యలపై స్తంభింప చేస్తానన్నారు. తెలంగాణపై పోరాడేందుకు తాను ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూడా అసెంబ్లీని తమ ఎమ్మెల్యేలు నడవనివ్వరన్నారు. ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. నేను బతికున్నంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని వీడేది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్లింపుపై దళిత సంఘాల ఆందోళనకు మద్దతివ్వాలని కెసిఆర్ తమ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. దళిత సంఘాల చలో అసెంబ్లీకి తమ మద్దతు ఉంటుందన్నారు.