విజయ్ కు భారీ ఊరట- సీఎం కుర్చీ దిశగా: ఆ పార్టీ బేషరతు మద్దతు
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డీఎంకే- 59, ఏఐఏడీఎంకే- 47, కాంగ్రెస్- 5, పీఎంకే- 4 సీట్లు స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా- ఈ పరిణామాల మధ్య తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై టీవీకే చర్యలు ప్రారంభించింది. ప్లాన్ బీ అమలు చేయనుంది. ఈ విషయంలో ఇప్పటికే అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి కూడా. కాంగ్రెస్, పట్టాళి మక్కల్ కచ్చి (PMK) టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా రెండేసి మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల మధ్య విజయ్ కు భారీ ఊరట లభించింది. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) బహిరంగ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ప్రేమలత విజయకాంత్.. ఆయనకు మద్దతు ఇస్తోన్నట్లు వెల్లడించారు. విజయ్ ను తమ కుటుంబ సభ్యుడిగా అభివర్ణించారు. విజయ్ మొదటి నుంచి కెప్టెన్ (విజయ్ కాంత్) తోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రేమలత మరెవరో కాదు.. డీఎండీకే వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి దివంగత విజయ్ కాంత్ భార్య.
విరుధాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి విజయ్ ఎస్‌పై 2,387 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రేమలతకు 69,351 ఓట్లు రాగా, విజయ్ ఎస్ 66,964 ఓట్లు పోల్ అయ్యాయి. విరుధాచలం డీఎండీకేకు కంచుకోట. 2021 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ప్రేమలత విజయకాంత్ తిరిగి పోటీ చేయడం ద్వారా డీఎండీకే తన సంప్రదాయ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది.
మరోవంక- టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన శాసనసభ్యులతో చర్చించారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు గవర్నర్‌కు విజయ్ లేఖ రాశారు. ఆయనను కలవడానికి అపాయింట్ మెంట్ కోరారు. సభలో బలాన్ని నిరూపించుకోవడానికి రెండు వారాల సమయం కావాలని గవర్నర్‌ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications