RBI వడ్డీ రేట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం..
సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను తగ్గించగానే, మన హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ వడ్డీలు కూడా వెంటనే తగ్గిపోతాయని ఆశిస్తాం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ భారీగా రేట్లు తగ్గించినా, సామాన్యుడికి ఆ ప్రయోజనం పూర్తిస్థాయిలో అందలేదని చేసిన ప్రకటన షాక్ కు గురిచేసింది.
దేశంలో పెట్టుబడులు పెరగాలి, ప్రజలకు తక్కువ వడ్డీకే రుణాలు అందాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ 2025 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఏకంగా 1.25% (125 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. అంటే 6.50% నుండి 5.25%కి వడ్డీ రేటు పడిపోయింది. కానీ, బ్యాంకులు మాత్రం లోన్ రేట్లను ఆ స్థాయిలో తగ్గించలేదని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక వెల్లడించింది.

ఎంత తగ్గాలి.. ఎంత తగ్గింది?
ఆర్‌బీఐ 125 పాయింట్లు తగ్గిస్తే, బ్యాంకులు కొత్త రుణాలపై సగటున కేవలం 93 పాయింట్లు మాత్రమే తగ్గించాయి. ఇక పాత రుణాల రేట్లను నిర్ణయించే MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్) అయితే కేవలం 45 పాయింట్లు మాత్రమే తగ్గింది. అంటే ఆర్‌బీఐ ఇచ్చిన ఊరటలో సగం కూడా పాత రుణగ్రహీతలకు అందలేదన్నమాట.
ఏ బ్యాంకుల్లో వేగంగా తగ్గాయి?
వడ్డీ రేట్ల తగ్గింపు అనేది బ్యాంకుల రకాన్ని బట్టి మారింది:
- విదేశీ బ్యాంకులు: ఇవి రేట్లను వేగంగా తగ్గించాయి. వీటికి సంబంధించిన 94% రుణాలు నేరుగా మార్కెట్ రేట్లతో (EBLR) ముడిపడి ఉండటమే దీనికి కారణం.
- ప్రైవేట్ బ్యాంకులు: వీటిలో కూడా 89% రుణాలు మార్కెట్ రేట్లతో లింక్ అయి ఉండటంతో తగ్గింపు కొంత వేగంగానే ఉంది.
- ప్రభుత్వ బ్యాంకులు: ప్రభుత్వ బ్యాంకుల్లో కేవలం 51% రుణాలు మాత్రమే మార్కెట్ రేట్లతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇక్కడ వడ్డీ రేట్ల తగ్గింపు చాలా నెమ్మదిగా సాగింది.
ఏ రంగంపై వడ్డీ ఎంత ఉంది?
ప్రస్తుత లెక్కల ప్రకారం వివిధ రంగాల్లో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
- ఎక్కువ వడ్డీ: అసురక్షిత రిటైల్ రుణాలు (పర్సనల్ లోన్స్ వంటివి) - 10.1%, వ్యవసాయ రుణాలు - 9.81%.
- తక్కువ వడ్డీ: ఎగుమతి రుణాలు - 6.78%, గృహ రుణాలు (Home Loans) - 7.63%.
- మధ్యస్థం: వాహన, విద్యా రుణాలు - 9% పైన.
ఎవరికి లాభం జరిగింది?
వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల దేశవ్యాప్తంగా రుణగ్రహీతలు సుమారు 19,000 కోట్ల రూపాయల వడ్డీ ఖర్చును ఆదా చేసుకున్నారని అంచనా. ముఖ్యంగా విద్యా రుణాలు, ఎగుమతి రుణాలు మరియు ఎంఎస్ఎంఈ (MSME) రంగం వారు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువ లబ్ధి పొందారు. గృహ రుణగ్రహీతలకు కూడా కొంతమేర ఊరట లభించింది.
ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ ఒక స్థిరత్వానికి చేరుకుంది. కాబట్టి రాబోయే కొద్ది నెలల వరకు లోన్ వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నివేదిక అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications