ముంచుకొస్తున్న ఉప ఎన్నికలు, జూన్‌లోనే అవకాశం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గం నుంచి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా పర్యటనలు ప్రారంభించారు. ఆదివారం నాడు ఆయన పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
గత అనుభవాలను నేపథ్యంలో ఆఖరి నిమిషంలో కాకుండా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే 18 శాసనసభ స్థానాల రాజకీయ పరిస్థితులపైముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ రెండు రోజుల పాటు ఢిల్లీలో సమీక్షించారు. శనివారం నాడు ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని కేంద్ర మంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు కె.బి.కృష్ణమూర్తి హాజరవుతారు.
అలాగే ఉప ఎన్నికల షెడ్యూల్ జారీ కావడానికి ముందే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని, వారిలో ఉత్సాహం నింపేందుకు ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లోనూ ముందే పర్యటించి కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిశ్చయించారు. తిరుపతిలో మాత్రం సభ జరపాలని నిర్ణయించారు.
దీనికోసం 9న చంద్రబాబు తిరుపతి వెళ్తారు. పదో తేదీన అక్కడే బస చేయనున్నారు. తిరుపతి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 11వ తేదీన కడప జిల్లా రాయచోటి చేరుకొని కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఒక సీటుకు మినహా మిగతా సీట్లకన్నింటికీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications