కిరణ్‌పై ఆగ్రహం, ఉప ఎన్నికలకు డిఎల్ దూరమే?

కడప జిల్లాలోని సీట్లకు జరిగే ఉప ఎన్నికలను ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి డిఎల్ రవీంద్రా రెడ్డికి నచ్చడం లేదని తెలుస్తోంది. కడప జిల్లా నాయకుల సమావేశాన్ని గతంలో ముఖ్యమంత్రి తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని ఆయన బహిరంగంగానే వ్యతిరేకించారు. ఆ సమావేశానికి ఆయన దూరంగా కూడా ఉన్నారు. కడప జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే ఓ స్థానానికి బలిజ అభ్యర్థిని పోటీకి దించాలని డిఎల్ రవీంద్రా రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో అది ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి అందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
తన శాఖను కుదించడంపై డిఎల్ రవీంద్రా రెడ్డి అలక వహించి, తన రాజీనామా లేఖను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో కాంగ్రెసు ఉప ఎన్నికల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్ిడ రామచంద్రా రెడ్డి కూడా ముఖ్యమంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని ఆయన అడుగుతున్నారు. ఇటీవల ఆయన సోనియాను కలిసి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు.
కాగా, ఉప ఎన్నికల వ్యవహారాలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ స్వయంగా పర్యవేక్షించడానికి సిద్ధపడ్డారు. నియోజకవర్గాలవారీగా సమన్వయ కమిటీలను వేయాలని ఆయన అనుకుంటున్నారు. ఇందులో భాగంగా డిఎల్ రవీంద్రా రెడ్డిని ఆజాద్ ముందుకు తేవడానికి ప్రయత్నిసాస్తారా అనేది చూడాల్సి ఉంది. డిఎల్ రవీంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గాన్ని కలుపుకుని వెళ్లడానికి ఆజాద్ ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications