తెలంగాణ: ఎమ్మెల్యేలు, ఎంపిల దారులు వేర్వేరు

ఢిల్లీపై ఒత్తిడి పెంచేందుకు నేతల్లో సమన్వయం అవసరమని, తామంతా కలిసి కట్టుగానే ఉన్నామని అధిష్ఠానానికి సంకేతాలివ్వాలని ఈ సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు నిర్ణయించుకున్నారు. 24 నుంచి రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపడతామని దాని కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని పార్లమెంటు సభ్యులు చెప్పగా, ఢిల్లీకి తరలి వెళ్లి అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని, దీనికి జానారెడ్డి నాయకత్వం వహించాలని శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, రాజయ్య, జి.వివేక్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి కదలిక వచ్చిన ప్రస్తుత తరుణంలో అందరూ కలసికట్టుగా ఢిల్లీ పెద్దలపై మరింత ఒత్తిడిని పెంచాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేశామని సమావేశానంతరం కేశవరావు అన్నారు.
తెలంగాణలోని ప్రతి ప్రజా ప్రతినిధి ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నాడని, కొందరు చొరవతో ముందుకు వస్తుంటే మరికొందరు మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం అవుతుందో లేదో తనకు తెలియదని చెప్పారు. అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాసకు అజెండా ఉండదని, విలీనంపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాత్రమే చెప్పాలని ఆయన అన్నారు.
ఢిల్లీలో ఉన్నప్పుడే ఇలా సమావేశం అవ్వాలని అనుకున్నామని నగరంలో వాతావరణం బాగాలేనందునే మరికొందరు ఎంపీలు రాలేకపోయారని చెప్పారు. ఈ నెల 24 నుంచి రాష్ట్ర సాధన కోసం చేపట్టే కార్యక్రమాలను త్వరలోనే వెల్లడిస్తామని మందా జగన్నాథం, సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ విషయమై తాము మంత్రి జానారెడ్డితో మాట్లాడతామని అన్నారు. తాము పార్లమెంటును స్తంభింప చేశాక అధిష్ఠానంలో కదలిక వచ్చిందని అన్నారు.
తమకున్న సమాచారం మేరకు అధిష్ఠానం ఈ విషయమై చర్చిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామని అధిష్ఠానం అంటోందన్న ప్రచారంపై మాట్లాడుతూ అలాంటి వాటి గురించి అధిష్ఠానమే స్పందిస్తుందన్నారు. తమంతా కలిసే ఉన్నామని, ఎమ్మెల్యేలు, ఎంపీలు విడివిడిగా లేమని అన్నారు. కేశవరావు నివవాసంలో భేటీ తర్వాత పార్లమెంటు సభ్యులు జానారెడ్డితో సమావేశమయ్యారు.
తెలంగాణ అంశంపై అధిష్ఠానంలో కదలిక వచ్చిందని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇదే సరైన సమయమని ఈ ప్రాంత శాసనసభ్యులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు జానారెడ్డి నివాసంలో బిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, అనిల్, కిష్టారెడ్డి, బాలూనాయక్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమావేశమయ్యారు. అందరూ ఢిల్లీ వెళ్లి తెలంగాణపై అధిష్టానంపై ఒత్తిడి తేవాలని జానా రెడ్డి అన్నట్లు తెలుస్తోంది
ఇంత కాలం ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకూ ఆగాలని అధిష్ఠానం ఆదేశించిందని, ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, అందువల్ల ఇప్పుడు మౌనంగా ఉండడం సరి కాదని అన్నారు. తాజాగా తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల ఫలితాలు కూడా ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఈ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాయకత్వం వహించాలని జానారెడ్డిని శాసనసభ్యులు కోరారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులందరితోనూ మాట్లాడాలని, వారి ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు జానారెడ్డికి సూచించారు. అందరూ ఏమంటే దానిని ఆచరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశానంతరం బిక్షమయ్య గౌడ్, అనిల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ యువత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలే తప్ప ఆత్మబలిదానాలు చేసుకోవద్దని కోరారు. గుడ్‌ఫ్రైడే, హనుమాన్ జయంతి కారణంగానే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని వారు చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలసి ఏకతాటిపై తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామని వారు చెప్పారు. అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఒక కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. మళ్లీ మరోసారి సమావేశమై ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. తెలంగాణ అంశంపై ప్రజల ఆకాంక్షను అధిష్ఠానానికి వివరిస్తామని అన్నారు. శాసనసభా సమావేశాల తర్వాత కలుద్దామనుకున్నామని అందులో భా గంగానే సమావేశమయ్యాయని చెప్పారు.












Click it and Unblock the Notifications