జగన్‌కు ఝలక్: వైయస్ విగ్రహావిష్కరణపై ఘర్షణ

ముందు నిర్ణయించుకున్న ప్రకారం వైయస్ జగన్ శుక్రవారం కాజులూరు మండలంలోని గ్రామాల్లో జగన్ ప్రచార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కోలంకలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ చేత ఆవిష్కరింపజేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు స్థానిక కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కార్యక్రమాన్ని రూపొందించారు.
అయితే వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలతో కాంగ్రెసు కార్యకర్తలు విభేదించారు. ఈ విగ్రహాన్ని కాంగ్రెసు నాయకుల ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. అందువల్ల జగన్ చేత దాన్ని ఆవిష్కరింపజేసే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల ప్రయత్నాలను వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఘర్షణ చెలరేగింది.
వైయస్ జగన్ చేత విగ్రహాన్ని ఆవిష్కరింపచేసే ప్రయత్నాలను విరమించుకోవాలని స్థానిక కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చివరకు వైయస్సార్ కాంగ్రెసు కార్యర్తలు వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జగన్ తన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. కాజుపల్లి మండలం నుంచి ఆయన గంగవరం మండలం వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications