జగన్ ఒక్కడే ఆర్జించాడు, చిరు చెడగొట్టాడు: చంద్రబాబు

జిల్లా మంత్రి ధర్మాన ప్రసాద రావు వంటి వ్యక్తులు వందలమంది అక్రమార్కులు కాంగ్రెసులో ఉన్నారని చెప్పారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకు వచ్చింది టిడిపియేనని గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదలకు, బలహీనవర్గాలకు న్యాయం చేసేందుకు పార్టీ పెట్టారన్నారు.
ఈ కాంగ్రెసు ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వర్షాలు కురవకున్నప్పటికీ విద్యుత్ కోత లేదన్నారు. అప్పుడే తాను రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఉంటే టిడిపి ఓడిపోయి ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఈ సమస్యలు రాష్ట్రానికి వచ్చేవి కావన్నారు.
కాంగ్రెసు నేతలు వచ్చారు రాష్ట్రాన్ని దోచుకున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఎంతగా కాంగ్రెసు ఆటలు సాగినా అంతిమంగా మాత్రం ధర్మమే గెలుస్తుందని అన్నారు. మంత్రి ధర్మాన సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యారన్నారు. ధర్మాన ఇంటిపేరు అధర్మంగా మార్చుకోవాలన్నారు. కాంగ్రెసు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందన్నారు.
టిడిపి అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదన్నారు. ఎంతోమంది రాష్ట్రంలో సిఎంలు అయ్యారని కానీ ఎవరూ దోచుకోలేదన్నారు. జగన్ మాత్రం లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయన్నారు. మంత్రులు రాబందుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు 2014 ఎన్నికలలో డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు. ఓ వ్యక్తి సామాజిక న్యాయం పేరుతో పార్టీ స్థాపించి మళ్లీ తన పార్టీని కాంగ్రెసులో చేర్చి చెడగొట్టారని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. రెండేళ్లు పార్టీని నడపలేని వ్యక్తి ప్రజా సేవ ఎలా చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును చిరంజీవి చెడగొట్టారన్నారు. చిరు పార్టీ పెట్టడం వల్లనే కాంగ్రెసు గెలిచిందన్నారు. టిడిపిపి అధికారంలోకి వస్తే వ్యాట్ రద్దు చేస్తుందని చెప్పారు.
జగన్ ను త్వరలో ప్రజలు ఓదార్చే రోజు వస్తుందన్నారు. చట్ట సభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్ల సాధనకు టిడిపి కృషి చేస్తుందని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బిసిలకు ఉప ప్రణాళిక అమలు చేస్తామని ఆయన చెప్పారు. గత సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ తో పొత్తు చారిత్రక తప్పిదమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేక కుంభకోణాల్లో చిక్కుకున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications