జెసి ఝలక్: అనంతపురం మీట్ నుంచి అవుట్

ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ అనంతపురం, గుంటూరు జిల్లాల నేతలతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఎఐసిసి ప్రతినిధి వాయలార్ రవి కూడా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాలపై కూడా సమీక్ష జరిపారు మాచర్ల కోసం వేసిన సమన్వయ కమిటీలో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానారెడ్డిని, దేవరకొండ ఎమ్మెల్యేను వేశారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమన్వయ కమిటీలో ఉన్నారు.
ఉప ఎన్నికలను అధిష్టానం తీవ్రంగా తీసుకుంటోందని, ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని వాయలార్ రవి నాయకులకు సూచించారు. తాను కేంద్ర మంత్రిని అయి ఉండి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నానని, అలా ఉన్నందుకైనా పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. వ్యక్తులు తమకు ముఖ్యం కాదని, కాగ్రెసు విధానాలే ముఖ్యమని చెబుతూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు.
సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. పది మందితో బూత్‌ల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని ఆయన చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications