కడప జిల్లాలో సిఎం కిరణ్ ప్రజాపథం: డిఎల్ డుమ్మా

మహిళలకు జనవరి 1వ తేదీ నుంచి వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళల వల్లనే కుటుంబాలు ప్రగతి సాధిస్తాయని, అందుకే వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఆస్తి హక్కును కల్పించామని ఆయన చెప్పారు. మహిళలకు బ్యాంకుల ద్వారా గారంటీ అవసరం లేకుండా 15,500 కోట్ల రూపాయల రుణాలు ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మంచినీటి సమస్య పరిష్కారానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఏడు గంటల పాటు ఉచితంగా విద్యుత్తు ఇవ్వడానికి యూనిట్‌కు 9 రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు. పేదలపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సంపన్నులపైనే భారం వేస్తున్నామని, అయితే ప్రతిపక్షాలు సంపన్నులకు మేలు చేయడానికి తమపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికే ప్రజాపథం కార్యక్రమం చేపట్టామని, రాష్ట్రంలో 20 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎక్కడా ఆపలేదని, 27 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. రేషన్ కార్డులు పెంచామని, దీనిపై ప్రభుత్వంపై విమర్శలు తగవని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని రూపాయికి తగ్గించామని ఆయన చెప్పారు. మీ సేవా కార్యక్రమం ద్వారా లంచాలు ఇవ్వకుండా కార్యాలయాల్లో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications