భాను కిరణ్ ముఠాలో పెద్ద తలకాయలు, గన్స్ స్వాధీనం

ప్రస్తుతం సిఐడి దర్యాఫ్తు అంతా ప్రధానంగా భూములు, బెదిరింపుల కోణంలోనే జరుగుతున్నదని తెలుస్తోంది. కొందరు పారిశ్రామికవేత్తల్ని కూడా తుపాకులతో బెదిరించి డబ్బు వసూలు చేసినట్లుగా భాను అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మంగళి కృష్ణతో తనకు పన్నెండేళ్లుగా సంబంధాలు ఉన్నాయని భాను చెప్పారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సూరి హత్యతో పాటు భాను ముఠా పాల్పడిన నేరాలు అన్నింటి పైనా దర్యాఫ్తు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
సూరి పేరు చెప్పుకొని భాను అనేక సెటిల్మెంట్లు పాల్పడ్డాడట. సూరితో కలిసి కొన్ని, అతనికి తెలియకుండా కొన్ని సెటిల్మెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలతో కలిసి చేశారని సమాచారం. సినీ నిర్మాతలు సి.కల్యాణ్, శింగనమల రమేష్‌లు భానుతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరితో పాటు భాను జాబితా మరింత పెద్దగా ఉందని విచారణలో సిఐడి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
సినీ పరిశ్రమకు చెందిన మరికొందరితో పాటు కొందరు రాజకీయ నాయకులతోనూ కలిసి భాను సెటిల్మెంట్లు చేశాడట. వీరి జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. భూకబ్జాలు చేయడం, అడ్డు వచ్చిన వారిని భయపెట్టడం, సినీ పరిశ్రమలో ఫైనాన్స్ చేసిన వారిని బెదిరించడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. మంగళి కృష్ణ తనకు ఆయుధాలు ఇచ్చినట్లు భాను చెప్పినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా భాను కిరణ్‌ను సిఐడి అధికారులు బుధవారం నుండి తొమ్మిది రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. గురువారం భాను తెలిపిన వివరాల ప్రకారం పలు ప్రాంతాలలో సోదాలు చేసి నాలుగు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో రెండు, హైదరాబాదులో రెండు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications